Wednesday, November 18, 2026

తెలుగు మహిళ - ఇల్లిందల సరస్వతీ దేవి | CLASS 10th TELUGU

తెలుగు మహిళ - ఇల్లిందల సరస్వతీ దేవి

రచయిత్రి పరిచయం :
ఇల్లిందల సరస్వతీదేవి స్వాతంత్ర్యానికి పూర్వమే సృజనాత్మకత రంగంలోకి అడుగుపెట్టిన ప్రసిద్ధ రచయిత్రి. ఈమె వందలాది కథలు, కొన్ని నవలలు, రేడియో నాటికలు, అనేక వ్యాసాలను రచించిన బహుముఖ ప్రజ్ఞావంతురాలు. 1982లో ఈమె రచించిన 'స్వర్ణ కమలాలు' కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ వచ్చింది. రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సుశీలా నారాయణరెడ్డి పురస్కారాన్ని కూడా పొందింది. 'తులసీ దళాలు', 'రాజహంస' ఈమె కథా సంపుటాలు.

పాఠం ఉద్దేశం :
తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను కాపాడటంలో స్త్రీలు ముఖ్యపాత్ర వహిస్తున్నారు అని తెలియజేయడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం.

ఈ పాఠం ‘వ్యాసం' అనే ప్రక్రియకు చెందినది. వివరించి చెప్పబడేది లేదా రాయబడేది వ్యాసం. ప్రస్తుత పాఠ్యభాగం ఇల్లిందల సరస్వతీదేవి రచించిన తెలుగువాణి - ప్రపంచ తెలుగు మహాసభల సంచిక-1975 లోనిది.
1
జాతి సంస్కృతినీ నాగరికతనూ ప్రజల వేషభాషలను బట్టీ ఆచారవ్యవహారాలను బట్టీ గుర్తించవచ్చు. వాకిట్లో ముగ్గూ, గడపలకు పసుపు కుంకుమలతో బొట్లూ, మామిడాకు బంతిపూలతో గుమ్మాలకు తోరణాలూ కనబడితే ఆ ఇల్లు పదహారణాల తెలుగువారి ఇల్లని ఏ విదేశీయుడైనా చెప్పగలుగుతాడు. ఆధునిక నాగరికతలో మునిగి తేలుతున్నా, దేశాంతరములో ఉన్నా తమ సంస్కృతినీ నాగరికతనూ సామాన్యంగా ఎవరూ విస్మరించరు. అందులో స్త్రీలు ఏమాత్రము విస్మరించలేరు.
మన జాతి సంస్కృతినీ నాగరికతనూ ఎటువంటి విపత్కరమయిన పరిస్థితులలో కూడా కాపాడింది ఎవరోకాదు - మన స్త్రీలు. వారు పరంపరాగతమైన సదాచారాలనూ అనుశ్రుతంగా వస్తున్న అలవాట్లనూ పట్టుదలతో దీక్షతో ఆచరిస్తున్నందువల్లనే మనజాతి సంస్కృతీ నాగరికతా సంరక్షింపబడ్డాయి.
ఆధునిక కాలములో సాంఘిక జీవనములో ఎన్ని మార్పులు వచ్చినా ప్రాచీనాదర్శాలు ఎంత నశించిపోయినా ఒక ఆదర్శము మాత్రము ఇంకా నిలిచిఉన్నది. వేయి మందిలో ఒక స్త్రీ అయినా తన పరిమితులలోనే పైకి కనబడకుండ నాగరికతనూ సంస్కృతినీ మతవిశ్వాసాలనూ మొలకెత్తించి పోషిస్తూ వాటితో సంబంధ సామరస్యాలను విడనాడకుండా ప్రతినిత్యమూ ఆ వెలుగులో తన భర్తను పిల్లలనూ నడిపిస్తుంది. గృహసీమకు రాణి అయిన గృహిణి అడుగుజాడలతో పురుషుడు నడుస్తున్నాడు.
మన స్త్రీలలో పరంపరాగతమైన నైతిక బలోద్వేగమూ దీక్ష జీవించి ఉన్నాయి. కష్టాలను ఓరిమితో సహించిన నీతమ్మా, యముడితో పోరాడి పతిప్రాణాలను దక్కించుకున్న సావిత్రీ, ఘోరమైన తపస్సుచేసి పరమశివుడిలో అర్ధభాగాన్ని పొందగలిగిన పార్వతి, త్రిమూర్తులను పసిపాపలనుగాచేసి తన శీలాన్ని కాపాడుకున్న అనసూయ, సూర్యచంద్రాదుల గతులను అరికట్టిన సుమతీ మన స్త్రీలకు ఆదర్శమూర్తులు. వివాహమనే పవిత్రవంతమైన సంస్థ ఈనాటికీ చెక్కు చెదరకుండా నిలిచిఉన్నది.
స్త్రీలు తమ ఆదర్శాలను సాధించటానికి పట్టుదలతో భక్తి శ్రద్ధలతో దీక్షతో నోములో వ్రతాలో ఆచరించి ఒక విశిష్టమైన శారీరక మానసిక క్రమశిక్షణను అలవరచుకున్నారు. నోములూ వ్రతాలూ స్త్రీల జీవితంలో పరమపవిత్రమైన కార్యాలు అతి ముఖ్యమైన ఘట్టాలు, ఉపవాసాలు వాటిలో ఒక భాగము.
ఈ నోములూ, వ్రతాల ద్వారా స్త్రీలు ఆపేక్షించేది తమ కుటుంబ సుఖమొక్కటే కాదు - సంఘంలో అందరి సుఖసంతోషాలనూ కోరుకుంటారు. ఒకమాటలో చెప్పాలంటే వారు కోరుకునేది సర్వేజనాః స్సుఖినోభవంతు.
2
ఉగాదికి తీపి పులుపు చేదు రుచులతో పచ్చడిచేసి జీవితము కష్టనుఖాల కలయిక తెలియజెప్పుతారు స్త్రీలు. నూతన సంవత్సరంనాడు ఏ చెడుపనీ ఏ పొరబాటు పనిచేసినా సంవత్సరం పొడుగునా ఫలితమిట్లాగే ఉంటుందని సూచన చేస్తారు.
వినాయక చవితికి పిల్లలతో విఘ్నేశ్వర పూజ చేయించి జీవితములో ఏ మంచిపనికీ విఘ్నము కలగకుండా ఆ దేవుని ప్రార్థిస్తారు.
శ్రావణమాసము స్త్రీలకు మంగళకరమైన మాసము. మంగళ గౌరీవ్రతమూ వరలక్ష్మీవ్రతములతో సందడిగా ఉంటుంది. కథ లోపమయినా భక్తిలోపం లేకుండా వ్రతమాచరిస్తారు.
నాగుల చవితినాడు తలారా స్నానముచేసి చిమ్మిలీ చలిమిడీ ఆవుపాలూ పుట్టలోని నాగులయ్యకు సమర్పించి సంతానము లేకపోతే సంతానము కలగాలనీ, ఉంటే వృద్ధిలోకి రావాలనీ కోరుకుంటారు.
ఆశ్వీయుజ కార్తీక మాసాలలో వచ్చేవి దసరా దీపావళీ పండుగలు. దసరాపండుగకు ముందు దేవీనవరాత్రులూ దుర్గపూజలూ దీక్షతో భక్తితో చేస్తారు. దీపావళి నరకాసుర వధానంతరం ప్రజలు జరుపుకున్న ఉత్సవాలు, ఆశ్వీయుజమాసం మొదలుకొని దీపావళి వరకూ పార్వతీదేవి ఘోరమైన తపస్సుచేసి పరమశివుడిని మెప్పించి ఆయనలోని అర్థభాగాన్ని పొందిందన్న పురాణగాథ ఒకటి ఉన్నది. ఈ రెండు పండుగలూ ఘనంగా జరుగుతాయి తెలుగువారి ఇళ్ళల్లో. 
సంక్రాంతి ఋతుసంబంధమైన వండుగ. వంటలు ఇళ్ళకు చేరే కాలము. భోగినాడు పిల్లలకు రేగిపళ్ళూ చెరుకుముక్కలూ తలమీద పోసి భోగిపీడ పోగొట్టుకునే పండుగ. పండుగనాడు గృహస్థుల పితృదేవతల సంతృప్తి కొరకు దానధర్మాలు చెయ్యాలి.
3
ఇలా సంవత్సరం పొడుగునా పెద్దవీ చిన్నవీ పండుగలు వస్తూనే ఉంటాయి. వాటికి తగిన ప్రాముఖ్యత వాటికీ ఉండనే ఉన్నది. ఈ ప్రాముఖ్యతను విస్మరించకుండా ఆచారాన్ని చెక్కుచెదరనీయకుండా కాపాడుతారు తెనుగువారింటి ఆడబడుచులు.
ప్రాచీనులు అధిక విద్యావతులు కాని స్త్రీలకు విద్యుక్త ధర్మాలనూ లౌకిక జ్ఞానాన్నీ, పురాణ పరిచయాన్నీ, చారిత్రాత్మక విశేషాలనూ, వేదాంత తత్త్వాలనూ, వైద్యవిషయాలనూ, పరంపరాగతమైన ఆచార వ్యవహారాలనూ - ఒకటేమిటి - సకల శాస్త్రాలనూ పాట ద్వారా బోధచేశారు. ఈ పాటలే వారికి విద్యాపీఠాలు. ఈ పాటలలోని సాంఘిక జీవనము అతిసహజమైనది. ఇవి సాంఘిక జీవితానికి కుటుంబజీవితానికీ ప్రతిబింబాలు. ఆంధ్రుల నాగరికతకూ సంస్కృతికీ ఈ పాటలు మూలాధారాలు. వీటిలో గృహిణి ఆశలూ, ఆశయాలూ, జీవితానందమూ, వాటికి సంబంధించిన వాతావరణమూ తప్ప మరొకటి లేదు. స్త్రీలు గృహకృత్యాలు నెరవేర్చుకుంటూ ఈ పాటల ద్వారా తమ విద్యుక్తధర్మాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ పరమార్ధిక చింతనను కూడా సాధించారు. పెద్దలపట్ల వినయ విధేయతలూ, భక్తిగౌరవాలూ, పిన్నలపట్ల వాత్సల్యమూ, పేదలపట్ల దయాదాక్షిణ్యాలూ, బంధుప్రీతి, అతిథి, అభ్యాగతుల సత్కారమూ ఇటువంటివన్నీ గృహ వాతావరణములో అబ్బిన సుగుణాలే. గృహమొక రాజ్యముగా పరిపాలిస్తున్న స్త్రీ మాతృమూర్తిగా ఒక సామ్రాజ్ఞిగా నిండు మనసుతో గంభీరంగా నిబ్బరంతో ఎన్ని కష్టాలు వచ్చి మీదపడినా తన ఆదర్శాలను విడనాడకుండా తన సంతతికి కూడా బోధిస్తుంది.
తెలుగువారి వంటకాలూ, రుచులూ, అలవాట్లూ, నమ్మకాలూ, ఆచారాలూ, మర్యాదలూ మన్ననలూ ఆశీస్సులూ ఆశలూ ఆశయాలూ - అన్నిటికీ అన్నీ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. వీటన్నిటికీ మూలము
ప్రాణం - జీవగఱ్ఱ స్త్రీ ఆమే జాతికి జ్ఞానజ్యోతి.





   





No comments: