రచయిత పరిచయం :
కనపర్తి మాలక్ష్మమ్మ, రంగయ్య దంపతులకు జన్మించిన రామచంద్రాచార్యుల స్వస్థలం పూర్వపు మెదక్ జిల్లా ప్రస్తుత సిద్ధిపేట జిల్లాలోని గట్లమల్యాల గ్రామం. తల్లి దగ్గరే భారత, రామాయణ, భాగవతాలు నేర్చుకున్నాడు. మొదట పశు సంవర్ధక శాఖలో, తర్వాత ఉపాధ్యాయునిగా పనిచేశాడు.
హృదయాంజలి, అక్షర శిల్పాలు, వెలుతురు పూలు, నైమిశారణ్యం, నగరంలో వెన్నెల మొదలగునవి ఈయన రచనలు. సరళంగా ఉండే ఈయన రచనాశైలి పలువురి మన్ననలు పొందింది. వచన కవితా ప్రవీణ బిరుదును, వేముగంటి పురస్కారాన్ని, జాతీయ సాహిత్య పరిషత్ పురస్కారాన్ని అందుకున్న కనపర్తి స్వర్ణ కంకణ సత్కార గ్రహీత.
పాఠం ఉద్దేశం :
శ్రమ పునాదిపైనే సమాజం నిలబడి ఉంది. శ్రామికుల ఘనతను, శ్రమ జీవన సౌందర్యాన్ని తెలియజేయడమే పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు :
ఈ పాఠం ‘వచన కవిత' ప్రక్రియకు చెందింది. ఛందస్సు, మాత్రాగణాల నియమం లేకుండా, స్వేచ్ఛగా భావయుక్తంగా, వాక్యాలతో ఉంటుంది. అభివ్యక్తీకరణ ప్రధానంగా కొనసాగుతుంది.
ఈ పాఠం కనపర్తి రామచంద్రాచార్యులు రచించిన 'రాళ్ళలో రాగాలు' కవితా సంకలనంలోనిది.
Xxxx
ఆమె ఝాన్సీలక్ష్మీ కాదు,
వీరనారి రుద్రమదేవీ కాదు;
ఈ సమాజం గుర్తుంచుకోవడానికి
ఆమె ఏ గొప్ప నాయకురాలూ కాదు!
ఆమెను నా చిన్నప్పట్నుంచీ
నేను చూస్తూనే ఉన్నాను
ఉదయం వీధి తలుపులు తెరవగానే సూర్యుని కంటే ముందే
నాకు ఆమె దర్శనమౌతుంది!
రేగిన దుమ్ముమబ్బుల మధ్య
ఆమె రూపు రేఖలు అస్పష్టంగా కన్పిస్తాయి! ఆ ఊడ్పు చప్పుళ్ళలో
ఆమె గుండె నిట్టూర్పులు స్పష్టంగా విన్పిస్తాయి!
చేతిలో నిడుపాటి చీపురుకట్ట
చంకలో వెదురుతో అల్లిన చెత్తబుట్ట :
నేలతల్లి సేవలో పండిపోయిన ఆమె
ఎన్నెన్నో అనుభవాల పుట్ట!
తెల్ల చీర కట్టుకొని
అహింసలా ఆమె నడిచివస్తుంటే
వీధులన్నీ పులకించిపోతాయి!
మైలపడ్డ తమ జీవితాలకు
కొత్తకాంతి వస్తుందని మురిసిపోతాయి!
ఆమె రానినాడు
వీధులన్నీ వ్యాధిగ్రస్తులైనట్లు
నల్లమొహాలు వేసుకుంటాయి!!
తన విధ్యుక్త ధర్మ నిర్వహణలో -
నిత్యం ఊడ్చి ఊడ్చి పాపం,
వంగిన నడుంతో ఆమె వీధికంకితమైపోతే
ఆ వీధి మాత్రం
ఎవరి పేరుకో అంకితమైపోయింది!
అయినా తెల్లవారి లేస్తే -
బ్రతుకు వీధిలో పడే ఆమెకు
గాంధీ వీదైతేనేం.
నెహ్రూ వీదైతేనేం.
ప్రతి రోడ్డు ఆమెకు బిడ్డలాంటిదే!
ప్రతి చౌరస్తాకు ఆమె తల్లిలాంటిదే!!
అలాంటి ఆమె రానినాడు.
రాలేదని తిడతారే తప్ప
ఎందుకు రాలేదని
విచారించే సహృదయం ఎవరికుంది?!
మల్లమ్మొ, మరియమ్మ, మంగమ్మొ
ఆమె ఎవరైతేనేం?
మన ఆరోగ్యం కోసం
సదా సమ్మార్జన సేవతో తపించే ఆమెలో నేనొక 'మహాత్ముని' చూస్తాను!
ఒక 'మదర్ థెరిస్సా'ను చూస్తాను!! నాదేశమాతకు చేసినట్లే,
ఆమెకు అభివందనం చేస్తాను!!
No comments:
Post a Comment