9 భాగ్యోదయం - కృష్ణస్వామి ముదిరాజ్
రచయిత పరిచయం :
కృష్ణస్వామి ముదిరాజ్ స్వాతంత్య్ర సమరయోధుడు, రచయిత విద్యావేత్త, విలేఖరి. పేదరైతు కుటుంబంలో జన్మించిన ఈయన హైదరాబాదులో విద్యాభ్యాసంచేసి హైదరాబాదు నగరానికి మేయర్గా పనిచేసి అభివృద్ధికి పాటుపడ్డాడు. 'దక్కన్టార్' అనే ఆంగ్ల వార పత్రికను స్థాపించి సంపాదకునిగా ఉండి విలువైన సంపాదకీయాలు, వ్యాసాలు రాశాడు.
హైదరాబాద్ చరిత్రను తెలుసుకోవడానికి ఈయన రచనలు ప్రామాణికాలు. 'పిక్టోరియల్ హైదరాబాద్' అనే అద్భుతమైన గ్రంథాన్ని దృశ్యరూపంగా మనకు అందించాడు. తన మిత్రుడు భాగ్యరెడ్డి వర్మతో కలసి దళితుల అభ్యున్నతికి కృషి చేశాడు.
పాఠం ఉద్దేశం :
మానవులంతా సమానమే. అన్ని వర్గాల వాళ్ళకూ సామాజిక భాగస్వామ్యం మరియు చైతన్యం ఎంతో అవసరం. చైతన్యం రావాలి అంటే చదువుకోవడం ముఖ్యం. అన్ని వర్గాల వారికి చదువు ప్రాధాన్యతను వివరించి, వారిని ఉత్తేజపరచడానికి నడుం బిగించాలి అని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు :
ఈ పాఠం ‘జీవిత చరిత్ర' అనే ప్రక్రియకు చెందినది. వ్యక్తుల విశిష్టతలను తెలుపుతూ రాసే గ్రంథమే ‘జీవిత చరిత్ర'. సమాజ అభ్యున్నతికి కృషిచేస్తూ, సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల జీవిత చరిత్రను రాస్తారు. భాగ్యరెడ్డి వర్మ కుమారుడు ఎమ్.బి. గౌతమ్ 'భాగ్యరెడ్డి వర్మ జీవితచరిత్ర' అనే గ్రంథం సంకలనం చేసాడు. ఆ గ్రంథంలోని కృష్ణస్వామి ముదిరాజ్ రాసిన అంశమే ఈ పాఠ్యభాగం.
xxxxx
జీవితచరిత్ర
తన జాతి జనుల బాగుకోసం చిన్నప్పటి నుండే అంకితమయిన భాగ్యరెడ్డి వర్మ 1888లో పుట్టినాడు. ఆయన చిన్నప్పుడు చదువుకున్న చదువే ఆయన జీవిత గమనాన్ని నిర్దేశించింది. అంటరాని వర్గాలు అప్పటికి అనుభవిస్తున్న అవస్థల నుంచి గట్టెక్కించడానికి ఆయన 'అంకిత భావంతో పని చేశాడు. తాను చదివిన చదువు వల్ల కులవ్యవస్థ అంటే ఏమిటో దాని నిజస్వరూపం ఎటువంటిదో అవగతమయింది. ఇందుకు ధర్మశాస్త్రాలను, చరిత్రను బాగా చదివినాడు. వాటి వల్ల అంటరాని వర్గాల కడగండ్లను అర్థం చేసుకోవడానికి వాటిని నిర్మూలించి వారిలో సామాజిక వికాసం కలిగించడానికి ఆయనకు దొరికినట్టయింది. దారి అత్యంత ముఖ్యమయిన ఈ పనికి సంబంధించి ఆచరణ, ఆలోచనలో ఆయన పూర్తి స్వేచ్ఛను అనుభవించాడు. స్వతంత్రంగా పని చేశాడు. ప్రభుత్వపక్షం నుంచి సైతం ఆయనకు అండ దొరికింది. అణగారిన కులాల నాయకులతో కూడా ఈ క్రమంలో పరిచయం పెరిగింది. క్రమ క్రమంగా వారి నుంచి సహకారం, నైతిక మద్దతు కూడగట్టుకున్నాడు. గొప్ప మనుషులలో, సంస్కర్తలలో ఉండే చిత్తశుద్ధిని అలవర్చుకుని ఆయన అంటరాని వర్గాల ఉన్నతి కోసం సంస్కరణ మొదలు పెట్టాడు.
ఒకవేళ హిందూమతం, హిందువులు తమ చరిత్రను లిఖిత బద్ధం చేయాలనుకుంటే సంస్కర్తగా భాగ్యరెడ్డివర్మ పేరు మొదటిస్థానంలో ఉంటుంది. అణగారినవర్గాల వికాసానికి ఆయన తన సమస్తాన్ని అర్పించాడు. తన తెలివితేటలను అందుకోసమే వెచ్చించాడు. ఏమీ ఆశించకుండా, తమకోసం ఎప్పటికీ పనిచేసే ఆయనను చూసి అంటరాని వర్గాలన్నీ ఆయనను తిరుగులేని నాయకునిగా ఒప్పుకున్నాయి.
చిత్తశుద్ధి, నిజాయితీ, పట్టుదలతో పనిచేసే వర్మ అచిరకాలంలోనే వారి నమ్మకాన్ని చూరగొనగలిగాడు. తమ దుస్థితికి కారణం తమ అజ్ఞానం, ఉదాసీనతేనన్న ఎరుకను తన అనుచరులలో కలిగేటట్టు చేయగలిగాడు.
మనుషులంతా పుట్టుకతో సమానమని, ఎవరూ ఎక్కువ, ఎవరూ తక్కువ కాదన్న సత్యాన్ని తెలుసుకునేటట్టు చేశాడు.
అయితే లోలోపల జీర్ణించుకుపోయిన మూఢనమ్మకాలు అజ్ఞానాన్ని తొలగించడం అంతగా సులువుకాదన్నది తెలిసిందే. అయితే కొద్ది కొద్దిగానే అయినప్పటికీ ఆయన నిరంతర శ్రద్ధ వల్ల అంటరాని వర్గాలు చదువుపై చూపు పెట్టడం సాధ్యమైంది. ఇందువల్ల కొన్ని సాంఘిక దురాచారాలు మటుమాయం కావడం జరిగింది.
II
ఆయన అనేక బహిరంగ సభలు నిర్వహించాడు. సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి తన జాతి జనులను ఏకతాటిపై నడపగలిగాడు. ఆయన చేపట్టిన పనులలో కెల్లా మరుపురానిది దేవదాసి, వేశ్యా సంప్రదాయాలను అడ్డుకోవడం. పసివాళ్ళయిన ఆడ, మగ పిల్లలను దేవునికి వదిలి వేయడాన్ని తీవ్రంగా నిరసించాడు. తాగుడు వలన కుటుంబాలు ఎట్లా గుల్లగా మారిపోతాయో కుల పెద్దలకు ఆ మహమ్మారి గురించి చెప్పి వారిని మానిపించగలిగినాడు. నిరంతరం తన కార్యాచరణకు దొరికే సహకారంవలన ఆయన కొన్ని కుటుంబాలను ఈ దురాచారాలనుంచి బయటపడేలా చేశాడు.
ప్రతి ఏటా జరిగే మత సాంఘికసభలకు ఆయన హాజరయ్యేవారు. ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే ప్రముఖులపై ఆయన ప్రభావం ఎంతగానో ఉండేది. ఆంధ్రమహాసభ, ఆదిహిందూ మహాసభ, అఖిలభారత అంటరానివర్గాల సభ వంటి సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించిన అనేక సభలలో ఆయన చురుకుగా పాల్గొన్నాడు. ఆయన పాల్గొన్న ప్రతి సభలో తన జాతి జనులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులపై వివరంగా చెప్పేవాడు. ఆయన జన జీవితంలో కాలు పెట్టినదాదిగా మొత్తం 3,348 ఉపన్యాసాలు ఇచ్చినట్టు తేలింది. ఆయన అణగారిన వర్గాలలో చైతన్యాన్ని తేవడానికి కృషి చేసినాడు.
1925లో న్యాయమూర్తి రాయ్బల ముకుంద్ అధ్యక్షత వహించిన ఒక సభలో హైదరాబాద్ సంస్థానంలో గల ఆది హిందువుల ప్రతినిధులంతా ఆయనను తమ మార్గదర్శకునిగా ఎన్నుకున్నారు. ఇది ఏ సామాజిక వర్గపు నాయకునికైనా గర్వకారణమవుతుంది. ఆయన 1925లో ఆదిహిందువుల ఆటల ప్రదర్శన నిర్వహించి, ఆదిహిందూ యువతీయువకులు సవర్ణ యువతీ యువకులతో సమంగా రాణిస్తారని నిరూపించాడు.
ఆది హిందువుల మేలుకోసం వర్మ నిరంతరం చేపట్టిన కార్యాచరణ ఎంతో మంది ప్రముఖుల మనసులను చూరగొని వారు ఆదిహిందువులకు దగ్గరయ్యేలా చేసింది. భాగ్యరెడ్డివర్మ నిరంతర కార్యాచరణ సభల వలన ఆదిహిందూ సమాజం జాగరూకమయ్యింది. ఆదిహిందువులు సొంతకాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గమని వర్మ బలమయిన నమ్మకం. ఈ విషయంలో ఆయన ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తన బాధ్యతను గుర్తించేలా చేశాడు.
కృషి, పోరాటం ఫలితంగా ప్రభుత్వం ఆదిహిందువుల కోసం ఎన్నో పాఠశాలలు నెలకొల్పింది. 1931 జనాభా లెక్కల సేకరణ సందర్భంగా వర్మ ఎంతగానో శ్రమపడి అంటరాని వర్గాలను ఆది హిందువులుగా నమోదు చేయించాడు. ఇది ఆయన నాయకత్వ పటిమకు మచ్చుతునక. హిందూ సమాజం మొత్తంగా ఆయనకు రుణపడి ఉండాలె. ఆ చర్యతో హిందూ సమాజాన్ని ఆయన చీలికలు, పేలికలు కాకుండా రక్షించగలిగాడు.
No comments:
Post a Comment