నీతి పరిమళాలు - శతక కవులు
పాఠం ఉద్దేశం :
నైతిక విలువలు, జీవన విధానాలు, మంచి నడవడి మొదలగు అంశాలను విద్యార్థుల్లో పెంపొందింపచేయడమే ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు :
ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకంలో నూరు లేదా నూట ఎనిమిది పద్యాలు సాధారణంగా ఉంటాయి. శతకాల్లోని పద్యాలకు పద్యాలతో చివరన మకుటం ఉంటుంది. ప్రతీ పద్యం ప్రత్యేకమైన భావంతో ఉంటుంది.
ప్రస్తుత పాఠంలో - సుమతీ, దాశరథీ, భాస్కరా, కుమారా, వేమన, సర్వేశ్వర, నరసింహ, భర్తృహరి శతకాలలోని పద్యాలు ఉన్నాయి.
Xxxxxx
కవుల పరిచయాలు
1 ) సుమతీ శతక కర్త - బద్దెన : మనిషి జీవితానికి అవసరమైన అనేక నీతులను, లోకవ్యవహారాలను తన పద్యాల్లో అందించాడు. ఈయన పద్యాలు చాలా సులభ విధానంలో ఉంటాయి. 'నీతిశాస్త్ర ముక్తావళి' అనే మరో గ్రంథం కూడా రాశాడు.
* నడువకుమీ తెరువొక్కట
గుడువకుమీ శత్రునింట, గూరిమితోడన్ ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ!
తాత్పర్యాలు : ఓ చక్కని బుద్ధిగలవాడా! దారిలో ఒంటరిగా నడువకు. నీ శత్రువు ఇంట్లో భోజనం చేయకు. స్నేహంగా ఉంటూ ఇతరుల ధనాన్ని మీ సొంతం చేసుకోకు. ఇతరుల మనసు నొప్పించే రకంగా మాట్లాడకు.
xxxxx
2) దాశరథీ శతక కర్త - కంచర్ల గోపన్న : ఈయన భద్రాచలంలోని శ్రీరాముని భక్తుడు. రామదాసుగా పేరొందినాడు. రామదాసు ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి గ్రామస్థుడు. శ్రీరాముణ్ణి కీర్తిస్తూ అనేక సంకీర్తనలు రాశాడు
* నోచిన తల్లిదండ్రికి దనూభవుడొక్కడె చాలు మేటి చే
జూచని వాఁడు వేదొకడు జాచిన లేదనకిచ్చువాఁడు నో
రాఁచి నిజంబకాని పలుకాడనివాఁడు రణంబులోన మేన్
దాచనివాఁడు భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!
తాత్పర్యాలు : కరుణ అనే సముద్రమే నిధిగా కలిగినవాడా! భద్రాచలంలో నివాసం ఉన్నవాడా! దశరథ మహారాజు కుమారుడా! శ్రీరామా! తల్లితండ్రులకు గొప్పవాడయ్యే ఒక కొడుకు ఉన్నా మంచిదే. అతడెలా ఉండాలంటే ఎవరి దగ్గర చేయి చాపుతూ బ్రతుకకూడదు. పదిమందికి దానం చేసే స్థితిలో ఉండాలి. అబద్ధాలు ఆడకూడదు. యుద్ధంలో వెన్ను చూపకూడదు. ఇలాంటి కొడుకే గొప్పవాడు.
xxxxx
3) భాస్కర శతక కర్త - మారద వెంకయ్య : ఈయనను మారన అని కూడా పిలుస్తారు. ప్రతి పద్యంలో దృష్టాంతం చెప్పటం ఈయన శతకానికి ఉన్న ప్రత్యేకత. మారద వెంకయ్య రాసిన భాస్కర శతకం తెలుగులో 'తొలి దృష్టాంత' శతకంగా ప్రసిద్ధిని పొందింది.
* సిరిగలవానికెయ్యెడల జేసిన మేలది నిష్ఫలంబగన్
నెఱిగురిగాదు పేదలకు నేర్పున జేసిన సత్ఫలంబగున్
వఱపున వచ్చి మేఘుడొక వర్షమువాడిన చేలమీదటన్
కురిసిన గాక యంబుధుల గుర్వగనేమి ఫలంబు భాస్కరా!
తాత్పర్యాలు : ఓ సూర్యభగవానుడా! డబ్బు / సంపద ఉన్నవాడికి మేలు చేస్తే అది ప్రయోజనాన్ని కలిగించదు. వృథా అయినట్లే. అదే మేలు పేదలకు చేస్తే చక్కని ప్రయోజనాన్ని కలిగిస్తుంది. వృథాకాదు. ఎలాగంటే - నీటితో నిండుకున్న మేఘము వాడిపోతున్న / ఎండిపోతున్న పంట పొలాలపై వర్షం కురిపించాలి. అది ప్రయోజనకరం. అంతేకాని ఆ మేఘము తన వర్షాన్ని సముద్రంపై కురిపించిన ప్రయోజనం లేదుకదా! అది వృథా అయిపోతుంది.
xxxxx
4) కుమార శతక కర్త - పక్కి వేంకట అప్పల నరసింహ కవి : ఈయననే అప్పల నరసయ్య కవి అని కూడా పిలుస్తారు. 'కుమారీ' అనే మరో శతకం కూడా రాశాడు. పిల్లలను ఉద్దేశించి ఈయన రాసిన ఈ రెండు శతకాల పద్యాలు చాలా సులభశైలిలో ఉన్నాయి.
* ఆచార్యున కెదిరింపకు
బ్రోచిన దొర నింద సేయబోకుము, కార్యా లోచనము లొంటి జేయకు
మాచారము విడువబోకు మయ్యకుమారా!
తాత్పర్యాలు : కుమారా! ఉపాధ్యాయుడిని ఎదిరించకు. నీకు రక్షణగా ఉన్న వ్యక్తిని నిందించకు. ఏదైనా పనిచేస్తున్నప్పుడు నీ ఒక్కని ఆలోచనతో మాత్రమే చేయకు. మీ ఇంట్లో ఆచరించే ఆచారాన్ని ఎప్పుడు విడువకుండా ఉండుము.
xxxxx
5) వేమన శతక కర్త - వేమన : వేమ భూపాలుడే వేమన. కడప జిల్లా ప్రాంతంవాడని పరిశోధకుల అభిప్రాయం. పిల్లలకు సులువుగా అర్ధం అయ్యే విధానంలో పద్యాలు రాశాడు. ప్రజల భాషలో మంచి ఉపమానాలతో చెప్పడం ఈయన సహజ లక్షణం.
అల్పుడెపుడు పలుకు నాడంబరముగాను సజ్జనుండు బలుకు చల్లగాను కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా? విశ్వదాభిరామ! వినురవేమ!
తాత్పర్యాలు : విశ్వద, అభిరాములను అనుసరించే ఓ వేమా! అల్పబుద్ధితో ఉండేవాడు (లేని / చేయని విషయాలను ఎక్కువచేసి) ఆడంబరంగా చెప్తాడు. మంచి బుద్ధికలవాడి మాటలు అందరికి నచ్చేట్లు ఉంటాయి. అల్పబుద్ధివాని మాటలు కంచు శబ్దంలా ఇబ్బందిపెట్టేలా ఉంటాయి. మంచివాని మాటలు బంగారపు శబ్దంలా ఏ ఇబ్బంది పెట్టకుండే విధంగా ఉంటాయి.
విధంగా ఉంటాయి.
xxxx
6) సర్వేశ్వర శతక కర్త - యథావాక్కుల అన్నమయ్య ఈ అన్నమయ్య శివకవులలో ఒకడిగా ప్రసిద్ధిపొందినాడు. ఈయన సర్వేశ్వర శతకంలో 142 పద్యాలు రాశాడు. ఈయన రచనా విధానం చాలా స్పష్టంగా అనేక విషయాలను తెలిపేరకంగా ఉంటుంది.
* సత్యం బెప్పుడు తప్పఁడేనియు, దురాచారుండు గాఁడేని, యౌ
చిత్యం చేమఱఁడేని, దుర్జనుల గోష్ఠిం బొందఁడే భక్త సాం
గత్యం బాదటఁ బాయఁడేని మదనగ్రస్తుండు గాఁడేని నీ
భృత్యుండాతఁడు మూఁడు లోకములలోఁ బూజ్యుండు సర్వేశ్వరా!
తాత్పర్యాలు : ఓ దైవమా! ఎప్పుడు సత్యం తప్పకుండా ఉండేవాడూ, చెడు ఆచారాలను పాటించనివాడూ, ఔచిత్యాన్ని మరచిపోనివాడూ, చెడు సంగతుల మార్గంలో ఉండనివాడూ, భక్తుల సాంగత్యాన్ని ఎప్పుడూ విడువనివాడూ, కోరికలకు లోనుకానివాడూ, ఇట్లాంటి వ్యక్తులే నీ సేవకులు అవుతారు. అలా నీ సేవకుడైన వాడే విశ్వంలో పూజించబడుతాడు. (గౌరవనీయుడు అవుతాడు).
xxxxx
7) నరసింహ శతక కర్త - కాకుత్సం శేషాచలదాసు : ఈయననే శేషప్ప కవి అని పిలుస్తారు. ఈయన ధర్మపురి నరసింహ స్వామి భక్తుడు. ఆ స్వామిని స్తుతిస్తూ 'నరహరి', 'నృకేసరి' అనే మరో రెండు శతకాలను కూడా రాశాడు. వీరు జగిత్యాల జిల్లా ధర్మపురి గ్రామవాసి.
తల్లిగర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయిననాడు వెంటరాదు
లక్షాధికారైన లవణమన్నమెకాని
మెరుగు బంగారంబు మ్రింగబోడు విత్తమార్జనజేసి విఱ్ఱవీగుటెకాని
కూడబెట్టిన సొమ్ము కుడువబోడు పొందుగామరుగైన భూమిలోపలబెట్టి దానధర్మములేక దాచి దాచి
తుదకు దొంగలకిత్తురో దొరలకౌనొ
తేనె జుంటీగలియ్యవా తెరువరులకు
భూషణ వికాస! శ్రీధర్మపురనివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!
తాత్పర్యాలు : ఆభరణాలచే ప్రకాశించేవాడా! దుష్టులను చంపేవాడా! పాపములను దూరంచేసేవాడా! శ్రీ ధర్మపురిని నివాసంగా కలిగినవాడా! నరసింహా!
అమ్మ కడుపు నుండి పుడుతున్న నరుడు తన వెంట ఏ ధనాన్ని తెచ్చుకోడు. పుట్టాక తాను సంపాదించిన ధనాన్ని తాను చనిపోయేటప్పుడు వెంట తీసుకుపోలేడు.
లక్షలు సంపాదించినవాడైనా తాను తినేది అన్నము, ఉప్పుతో కూడిన పదార్థాలే. అంతేకాని బంగారం తినలేడుకదా!
డబ్బు సంపాదించి నేను సంపాదించాను అని చెప్పుకోవటమే కానీ తాను సంపాదించిన ధనాన్ని తినలేడుకదా!
మనిషి తాను సంపాదించిన ధనాన్ని దానం ఇవ్వడు. ధర్మం చేయడు. ఆ ధనాన్ని భూమిలో దాచిపెడ్తాడు. అలా దాచిన ధనాన్ని దొంగలపాలో, రాజులపాలో చేస్తాడు. ఎలాగంటే తేనెటీగలు తాము కష్టపడి సంపాదించి తెచ్చి తేనె తుట్టెలో దాచి దాచి చివరకు బాటసారి పాలుచేస్తాయి. అంతేకాని అవి ఆ తేనెను తాగవుకదా! లోభి కూడా డబ్బు విషయంలో అంతేకదా!
xxxxx
8) సుభాషిత త్రిశతి అనువాదకులు ఏనుగు లక్ష్మణ కవి : భర్తృహరి అనే సంస్కృత కవి 'సుభాషిత త్రిశతి' అనే గ్రంథం రాసారు. దీన్ని తెలుగులో 'సుభాసిత రత్నావళి' అనే పేరుతో ఏనుగు లక్ష్మణ కవి అనువదించాడు. సుభాషిత త్రిశతి అనువాదకుల్లో ఈయన ఒకరు. వీరు పెద్దాపురం సంస్థానంలోని పెద్దాడ గ్రామవాసి.
* విద్యచే భూషితుండయి వెలయుచున్న దొడరి వర్ణింపనగుజుమీదుర్జనుండు చారుమాణిక్యభూషిత శస్తమస్త కంబుగల పన్నగము భయంకరముగాదె!
తాత్పర్యాలు :
గొప్పగా చదువుకొని ప్రకాశించేవాడైనా వాడు చెడ్డవాడైతే వానికి దూరంగానే ఉండాలి. ఎలాగంటే కాటువేసే పాము తలపై అందమైన రత్నం ఉందని ఆ రత్నాన్ని తీసుకోవటానికి పాము దగ్గరకు వెళ్ళలేము కదా! అలాగే విద్యావంతుడైన దుర్జనుడికి దూరంగా ఉండాలి.
xxxxxx