హస్తకళా నైపుణ్యం - పరాంకుశం దామోదరస్వామి
రచయిత పరిచయం :
పరాంకుశం దామోదరస్వామి గారు ప్రస్తుత హన్మకొండ జిల్లా శాయంపేట గ్రామంలో జన్మించాడు.
1963 నుండి 1987 మార్చి దాక ఆంధ్రజ్యోతి దినపత్రిక న్యూస్బ్యూరోలో వివిధ స్థాయిల్లో, 1987 నుండి 1991 వరకు ఆంధ్రప్రభ పత్రికలో పనిచేశాడు.
ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న కాలంలో 'రాజధాని లేఖ' శీర్షికను నిర్వహించి వందలాది వ్యాసాలు రాసాడు.
ఈయన వ్యాసాలను (లభ్యమైన వాటిని) 'ఈ నేల - ఈ గాలి' వ్యాస సంపుటిగా ప్రచురించాడు.
‘జాతీయ సమైక్యత, సహోదరత్వానికి” దోహదం చేసే జర్నలిస్టుకు ఇచ్చే అవార్డును 1985లో యునైటెడ్ హిందూ ముస్లీం ఫ్రంట్ ఈయనకు ప్రదానం చేసి సత్కరించింది.
పాఠం ఉద్దేశం :
మానవుడు తన జీవితంలో కోరుకునేది ఆనందం. ఆ ఆనందం పొందే మార్గాలు ఎన్నో ఉన్నా, వాటిలో మానవుని మెదడుచే (ఆలోచనచే) సృష్టించబడిన 'కళ'కు ప్రత్యేకస్థానమున్నది. ఎన్నో అపురూపమైన వస్తువులను తన మస్తిష్కంలో ఆవిష్కరించి, వాటికి రూపాన్నిచ్చి 'తన హస్తకళా నైపుణ్యంతో' మనల్ని అబ్బురపరచడం చూస్తున్నాం. ఇలా తమ హస్తకళా నైపుణ్యంతో ప్రపంచాన్ని తమవైపుకు తిప్పుకున్న పెంబర్తి కళాకారుల నైపుణ్యాన్ని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. ఇత్తడి లోహంతో వీరు తయారుచేసే వివిధ రకాల అందమైన వస్తువుల గూర్చి తెలుసుకుందాం...
పాఠ్యభాగ వివరాలు :
ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. ప్రస్తుత పాఠం పరాంకుశం దామోదర స్వామి గారు రచించిన 'ఈ నేల - ఈ గాలి' వ్యాస సంపుటి నుండి గ్రహించబడినది.
Xxx xx
అది పెంబర్తి గ్రామం. లోహాలలో హస్తకళా నైపుణ్యం చూపి, అపురూపమైన, అపూర్వమైన కళాఖండాలను సృష్టిస్తున్న కేంద్రమది.
పెంబర్తి గ్రామం వరంగల్లు జిల్లాలో జనగామ తాలూకా కేంద్రానికి సమీపంలో వున్నది. హైదరాబాద్ నగరానికి 60 మైళ్ళ దూరంలో వున్నది.
ఇత్తడి రేకులపై నగిషీ, పురాణ, చారిత్రక గాథల చిత్రాలు, నృత్య భంగిమలు, సుందరంగా పూలు, లతలు చెక్కి - ఇత్తడికి బంగారం లాంటి విలువ కలిగిస్తారు అక్కడి కళానిపుణులు.
పెంబర్తి గ్రామంలో ప్రస్తుతం ఈ కళానిపుణుల కుటుంబాలు 25 వరకు వున్నాయి. ఇత్తడి బోళ్లు (పాత్రలు) సిద్ధం చేసే కుటుంబాలు 25 వున్నాయి. వీరంతా విశ్వబ్రాహ్మణులు. గతంలో వీరి కుటుంబాలు 500 వరకు వుండేవి.
కాకతీయ రుద్రమదేవి కాలంలో వీరి పూర్వీకులు శిల్పులు. కాకతీయ శిల్పకళారీతికి భాగస్వాములు. సామ్రాజ్యం క్షీణించడంతో శిల్పకళకు అవసానదశ వచ్చింది. జీవనోపాధికోసం బంగారం, వెండితో ఆభరణాలు చేయడం ప్రారంభించారు.
రాళ్లతో చైతన్యం కలిగించిన ఆ చేతులు, సున్నితమైన బంగారం, వెండిపై నగిషీలు చెక్కడం విడ్డూరమే అయినా, వారికి 'కళా హృదయం' అని చెప్పక చెబుతున్నది.
పెంబర్తి గ్రామంలో 'ఏకాంబరేశ్వరి' ఆలయం ఒకటి వుంది. ఆ ఆలయం, పూర్వీకులు చెక్కిన చివరి శిల్పం.
ఈ కళానైపుణ్యం తరతరాలుగా, వంశపారంపర్యంగా సంక్రమించింది. వారి రక్తంలో కళాసంపద భావనా శబలత, సాంకేతిక విజ్ఞత ఇమిడిపోయాయి. కళాఖండాలను సృష్టించడం వారి నిత్యనైమిత్తికం. అది వారి జీవనం.
రాళ్ళపై ఉబ్బెత్తుగా మానవ, జంతు స్వరూపాలు, పూవులు, కాయలు, తీగలు చెక్కినట్టే, ఇత్తడి రేకుపై చెక్కుతారు.
వారి కళారీతిలో కాకతీయ, లేపాక్షి శిల్పశైలి వ్యక్తం అవుతుంది. దేశపరివ్యాప్తంగా ఎక్కడ శిల్పాలయాలు వున్నా ఏ సంప్రదాయం వున్నా దాన్ని ఆకళింపుచేసుకొని ఇత్తడిపై మలచడం వారి ప్రతిభ.
బిందెలు, గంగాళాలు, కొప్పెరలు, చెంబులు మొదలైన వస్తువులపై దశావతారాలు, నవగ్రహాలు, గీతోపదేశాలు, రామరావణ యుద్ధాలు, సముద్ర మథనాలు - కృష్ణలీలలు, గోపికా పరివేష్ఠితుడై గోపాలుడు, లేపాక్షి, హంసలు, కాకతీయనందులు, అమరావతీ ఏనుగులు ఎన్నో మరింకెన్నో వారి ప్రతిభలో చోటు చేసుకున్నాయి.
ఇక విద్యుద్దీపాల అలంకరణలు ఎన్నో రకాలు వున్నాయి. గోళాకారంగా, స్తూపాకారంగా, గంటాకారంగా, బెడ్లంపులు, నెమిలి ఆకారంలో లాంపులు చేయడంలో వీరి పనితనం చెప్పుకోదగింది.
దేవతా విగ్రహాలు, కవచాలు, ధ్వజస్తంభాలు, వాహనాలు, పూజాసామగ్రి, బంగారంతో, వెండితో, రాగితో, ఇత్తడితో పోతపోయడం కూడా పెంబర్తి శిల్పులకు ఉగ్గుతో వచ్చిన విద్య.
తెలంగాణా ప్రాంతంలోని పలు దేవాలయాలలోను, కోస్తా జిల్లాలో కొన్ని దేవాలయాలలో వీరి కళానంవద చోటుచేసుకున్నది. మహారాష్ట్రలోని తుల్జాభవాని దేవాలయం వీరి కళానైపుణ్యానికి కాణాచి.
II
కుతుబ్షాహి, అసఫ్జాహి (నిజాం నవాబులు) రాజుల కాలంలో నవాబులు, జాగీరుదారులు, ధనికులు పెంబర్తి కళాకారులను విస్తారంగా పోషించారు. బంగారు, వెండితో పొందాన్లు, నాగర్గాన్లు, హుక్కాలు, పన్నీరుబుడ్లు మొదలైన వస్తువులేకాక, వారి స్త్రీజనానికి ఆభరణాలు చేయడం వీరి సొత్తే! ఒక దశలో పెంబర్తి గ్రామాన్ని 'చాందినీఘర్’ అని నవాబులు ప్రీతితో పిలిచేవారట.
నవాబుల కాలం తరువాత బంగారు, వెండితో పనులు చేయడం ఆగిపోయింది. క్రమేణ ఇత్తడిపై తమ “పనితనాన్ని” చూపడం ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరి కళానైపుణ్యానికి మెచ్చి, 1956లో పెంబర్తిలో "విశ్వకర్మ బ్రాస్, కాపర్, సిల్వర్, ఇండస్ట్రియల్ కో-ఆపరేటివ్ సొసైటీ"ని నెలకొల్పి ప్రోత్సహిచింది. ప్రస్తుతం కళాకారులందరు తమ వస్తువులను సహకార సంఘం ద్వారానే విడుదల చేస్తుంటారు.
దేశంలో ఎన్నో కళా ప్రదర్శనలలోనే కాక, విదేశాలలో జరిగిన ప్రదర్శనలో పెంబర్తి కళాఖండాలు చోటుచేసుకున్నాయి. ఎక్స్పో-70, ఏషియన్-1972, క్రాఫ్ట్ ఇండియా - 1974 మొదలైన అంతర్జాతీయ హస్తకళా ప్రదర్శనలో పాల్గొన్నారు.
ప్రముఖులను సన్మానించినప్పుడు, బహుమతులు ఇచ్చినప్పుడు వాడుతున్న షీల్డులను ఇక్కడే తయారుచేయించం ఆయా సంస్థలకు మామూలు అయిపోయింది.
వీరికి కావలసిన ఇత్తడి రేకులు కలకత్తాలోని కాపర్ కార్పొరేషన్ సరఫరా చేస్తుంది. ఇది చాలా మేలురకమైనది. 72% రాగి, 28% యశదము మిశ్రమంతో ఇత్తడిలో మేలురకం వస్తుంది. బంగారువన్నె వస్తుంది. చక్కగా సాగుతుంది. నగిషీకి అనుకూలంగా ఉంటుంది.
నగిషి చెక్కడం విధానం - అదొక శాస్త్రం. అది వారికి ఉగ్గుపాలతో అబ్బిన విద్య. చెక్కడానికి వంద రకాల ఉలులు, మేకులు వాడుతారు, పనిముట్లను వారే సిద్ధం చేసుకుంటారు. ఆ తీరువి మరెక్కడా లభించవు.
ఆ కళాకారులతో ముచ్చటిస్తున్నప్పుడు, ఆ కళపట్ల వారికున్న అభినివేశం వ్యక్తం అవుతుంది. నైపుణ్యానికి ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకోవాలన్న ఉబలాటం కనిపిస్తుంది.
"మేము కేవలం అన్నం మీద ఆధారపడే జీవులం కాదు. కళ కోసం కూడా జీవిస్తాం. మా పనితనం చూపడానికి బంగారం, వెండి లభించని కాలం వచ్చింది. అందువల్ల ఇత్తడిపై చూపుతున్నాం. అది కూడా కరువు అయ్యేకాలం వస్తే, మళ్ళా రాళ్ళే శరణ్యం" అని శ్రీ అయిలాచారి అన్నారు. ఆ మాటలలో హృదయం వుంది. ఆత్మ విశ్వాసం వుంది. ధైర్యం వుంది.
“ఇది ఉద్యోగాలు దొరకని కాలం. పై చదువులు చదివినా లాభం లేదు. మా కులవృత్తి మాకు వుంది. దానిని వదులుకొని, ఇంకొక దానికి అర్రులు చాచటం అసందర్భం. నా కులవృత్తికి మెరుగులు దిద్దుతాను. రాణ తెస్తాను” అని మెట్రిక్యులేషన్ చదివిన 18 సంవత్సరాల వెంకటేశ్వర్లు అన్నాడు. ఆ మాటలలో పట్టుదల కనిపించింది. స్థైర్యం కనిపించింది. అది వారి కులవృత్తి, అది వారి హస్తకళ, అది వారి గృహ పరిశ్రమ.
No comments:
Post a Comment