బకాసురుడి విందు - పోల్కంపల్లి శాంతాదేవి
లీలకు ఈ రోజు మొదటిసారి పెళ్ళిచూపులు. ఒక మధ్యతరగతి అమ్మాయి పెళ్ళి చూపుల ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతాయో అలాగే జరిగాయి.
పిల్లను శల్యపరీక్ష చేస్తున్నట్లుగా. నిర్భయంగా కళ్ళు పత్తికాయలు చేసుకొని చూశాడు వరుడు. పిల్ల ఓరగా అయినా స్పష్టంగానే చూసింది.
“ఇంట్లోకి వెళ్ళమ్మా!" లీల తండ్రి నారాయణరావు చెప్పాడు.
"ఆఁ ఇక ఇచ్చిపుచ్చుకోవడాల సంగతి మాట్లాడుకొందామా?" మధ్యవర్తి వ్యవహారంలోకి దిగాడు.
"పిల్ల నచ్చిన తరువాత కదా?”
“చెప్పవయ్యా, సుధాకర్! పిల్ల నచ్చిందా?!
“ఆఁ" సంతృప్తితో తలాడించాడు. “కొంచెం ఆ పళ్ళు ఎత్తులేకపోతే బాగుండేదండీ! అయిన పర్వాలేదనుకోండి నాకు నచ్చింది!"
పక్క గదిలో తలుపు పక్కనే నిలబడి ఉంది లీల. వరుడు అంత నిర్మొహమాటంగా, ఏమనడానికైనా తనకు హక్కు ఉన్నట్టుగా తన పళ్ళమీద కామెంట్ చేయడం నచ్చలేదు. ఆ పిల్ల ఒళ్లు మండిపోయింది.
“ఏమ్మా? అబ్బాయి నచ్చాడా?" అని తనను అడగరేం?
"ఆయన కళ్ళు అంత మిడిగుడ్లలా ఉన్నాయేం? అయినా పర్వాలేదు. నచ్చాడు" అని చెప్పేది.
పెద్దల వ్యవహారం చాలా నిర్మొహమాటంగా ఖచ్చితంగానే నడిచింది.
వరుని రేటు పదివేలుగా తేలింది. ఇంకా ఆడపిల్లల లాంఛనాలు, అవీ ఇవీ...
నారాయణరావు ముఖం కొంచెం పాలిపోయింది. ఆయన అయిదువేల నగదూ, ఉంగరం, గడియారం లాంటి లాంఛనాలైతే తనవల్ల అవుతుందనుకున్నాడు. ఆ మాటే తేల్చి చెబితే ఈ సంబంధం ఇప్పుడే బెడిసికొడుతుందేమోనన్న జంకుతో.
"ఆదివారం నేనక్కడికి వస్తాను! అప్పుడు అన్నీ మాట్లాడుకుందాం" అన్నాడు.
పెళ్ళిచూపుల కార్యక్రమం ముగిసిపోయింది.
II
“ఏమిటే నువ్వు మాట్లాడేది?” లీల తల్లి విడ్డూరంగా అడిగింది.
"వరకట్నం పదివేలు కాదు!... కట్నం పేరుతో అతడు ఒక్కపైసా తీసుకొన్నా నేనతడిని చేసుకోను!" లీల ఖచ్చితంగా చెప్పింది.
"కట్నం ఇవ్వకపోతే అతడెందుకు చేసుకొంటాడే నిన్ను? రంభవని చేసుకొంటాడా? మినిస్టర్ బిడ్డవని చేసుకొంటాడా?” ఆమె తీవ్రంగా అంది.
“చేసుకోకపోతే సరే.”
"పెళ్ళీ పెటాకులు లేకుండా మా గుండెలమీద కుంపటిగా ఉండిపోతానంటావా!”
నా కంటే అయిదేళ్ళు పెద్దవాడు అన్నయ్య! వాడుకాని గుండెల కుంపటి నేనయ్యానా?”
"వాడికీ నీకూ పోలికేమిటే? వాడు మగాడు. ఏనుగు చచ్చినా వెయ్యే. బతికినా వెయ్యే అన్నట్టు మగాడు పెళ్లి చేసుకొన్నాసరే, చేసుకోకపోయినాసరే.
“మన జాతిని మనమే కించపరచుకోవడం ఎందుకమ్మా? మగాడి అండ ఆడదానికి ఎంత అవసరమో, ఆడదానితోడు మగాడికి అంతే అవసరం. ఆడది సంపాదించుకోనన్నాళ్ళు అతడి గొప్పతనం చెల్లింది కాని, ఇప్పుడు ఆడది. సంపాదించుకొంటోంది. అతడి పప్పులేం ఉడకవు.”
"బాగుందమ్మా వాదం! సంపాదనే సమానత్వం తీసుకవస్తుందా? నువ్వు కట్నం ఇచ్చి అతడిని పెళ్ళిచేసుకోకపోతే అతడికి పెళ్ళి కాదనా? మధ్యవర్తి చెప్పనే చెప్పాడు. మీ నాన్నగారిని చాటుకు పిలుచుకొని. సిరిపురం వాళ్ళు పన్నెండు వేలు ఇచ్చి రెండెకరాల పొలం వ్రాసిచ్చి, పట్నంలో ఇల్లు కొనిస్తామని వెంటపడ్డారట. తొందరగా సంబంధాన్ని నిశ్చయం చేసుకోకపోతే చేయిదాటి పోతుందట. ఇంత మంచి సంబంధం చేజార్చుకోవడం మీ నాన్నకు ఇష్టంలేదు. అందుకే ఆ పల్లెలో ఆ రెండెకరాలు బేరం పెట్టడానికి వెళ్ళారు.”
“మిమ్మల్ని సర్వనాశనం చేసే ఈ పెళ్ళి నేను చేసుకోను! నన్ను ఎక్కువగా బలవంతం పెడితే నా శవమే చూస్తారు!” లీల విసురుగా గదిలోకి వెళ్ళిపోయింది.
ఆరేడిళ్ళు వాడుకొనే నూతి దగ్గర ఆడంగుల సంభాషణ ఇలా సాగుతోంది.
"విన్నావా, పిన్నీ! మొన్న సుశీలమ్మ కూతురికి పెళ్ళిచూపులయ్యాయా...! వాళ్ళు పదివేల కట్నం లాంఛనాలు గట్రా అడిగారట, తండ్రి ఎలాగో తంటాలుపడి ఇవ్వడానికి సిద్ధపడితే, కట్నం తీసుకొనే వరుణ్ణి నేను చేసుకోను పొమ్మందట, ఆ pilla!"
"ఆ ఎత్తుపళ్ళకే అడిగి ఉంటారు పదివేలు." కిసుక్కున నవ్వు, "ఈవిడేమైనా తిలోత్తమా? ఊర్వశా? లేక పెద్ద ఉద్యోగస్తురాలా? వాళ్ళ నాన్న ఇండియా ప్రధానా? "నువ్వే ఒక కట్నం! వేరేకట్నమేల భామా!" అని ఆ వరుడు ముందుకురావడానికి? ఈవిడొక్కతి మీదినుండి ఊడిపడింది కాబోలు!"
"ఆ పిల్లదంతా మగరాయుడి పోజులెద్దూ! రిజల్టు వస్తూనే ట్రైనింగ్కు వెళుతుందట. ఉద్యోగం చేస్తుందట!"
"చేయనీ! ఎంతమంది చేయడంలేదు! తనేమిటో ప్రత్యేకంగా పుట్టుకొచ్చినట్టు కట్నం తీసుకొనేవాడిని పెళ్లిచేసుకోననడమేమిటి? ఆ పిల్లవాడికి కట్నం ఇచ్చి ఇంకెవ్వరూ పెళ్ళి చేయరనా?"
"మళ్ళీ ఎవరితోనూ అనకు కాని, మా రమణిని ఆ పిల్లవాడికి ఇద్దామనుకొంటున్నాం. నారాయణరావుకు పోటీ వెళ్ళినట్టు అప్పుడే ఎందుకు అడగాలని ఊరుకొన్నాం. అటో, ఇటో తేలుతూనే వాళ్ళు అడిగిన దానికి ఓ రెండువేలు ఎక్కువిచ్చి చేసినా బాధలేదు. రాజాలాంటి సంబంధమాయె! ఉద్యోగం చేస్తున్నాడు. పైగా పల్లెలో పొలం, ఇల్లు ఉన్నాయి. మనకు తగిన సంప్రదాయం కూడా."
ఈ సంభాషణలో పాల్గొని కిసుక్కున నవ్వినావిడే తన పాత్ర మినహాయించుకొని అందరి మాటలూ సుశీలమ్మ చెవిలో వేసింది. "ఆ రాధమ్మ గుంటకాడి నక్కలా కాచుక్కూర్చుంది. మీరు పిల్లమాట విని అంత మంచి సంబంధం పోగొట్టుకోకండి వదినా! నయానో, భయానో ఒప్పించండి ఆ పిల్లను!"
సుశీలమ్మ కంటనీరు పెట్టుకొని, పమిటతో తుడుచుకొంటూ "ఏం చేయనమ్మా? బొత్తిగా పెడసరం పిల్ల అయింది. బలవంతం చేస్తే చస్తానంటూంది?" అంది.
నారాయణరావు పల్లె నుండి అప్పుడే తిరిగి వచ్చాడు. ఆయన ముఖం వాడిపోయి అలసట సూచిస్తుంది. అయినా పని సాధించుకు వచ్చిన ఉత్సాహం ఆయన దాచుకోలేకపోతున్నాడు.
“ఒకేసారి వారం రోజులు వెళ్ళారే? ఈ పూటొస్తారు. ఆ పూటొస్తారు అని మూడు రోజుల నుండి మీ కోసం చూస్తున్నాను.”
“పోయిన పని కానిదే ఎలా వస్తాను? డబ్బు చేతిలో వేసుకొనే వచ్చాను. మనం ఇదో అదో అని తాత్సారం చేస్తే ఆ సంబంధం కాస్తా జారిపోతే...”
“ఇల్లు అలుకగానే పండుగ కాదు లెండి” అంటూ ఆవిడ ముఖం ముడుచుకొని భర్తకు స్నానానికి నీళ్ళు తోడబోతూ, “ఇవాళ ఎక్కడి నుండో మీకు ఉత్తరం వచ్చింది. అల్మారాలో ఉంచాను చూడండి” అంది.
నారాయణరావు అల్మారా తెరిచి కవరు తీసుకొన్నాడు. "వస్తామని, ఇంకా రాలేదేమిటని రాశారేమో! ఒకేసారి కట్నం డబ్బు తీసుకువెళ్ళి, వాళ్ళ చేతిలో పెట్టి, ఏకంగా ముహూర్తం పెట్టుకురావాలి!”
కవరు చించి ఉత్తరం బయటికి తీశాడు.
“శ్రీ సుధాకర్ రావుగారికి.
నమస్కారం.
నమస్కారం.
నా ఎత్తుపళ్ళమీద మీరు కామెంటు విసరినప్పుడు మీరు కొంచెం సోషల్గా ఉంటారనిపించింది. తరువాత తెలుపుతామని బెట్టుచేయకుండా పెళ్ళిచూపుల రోజే మీ అభిప్రాయం (నేను నచ్చానని చెప్పడం దాన్ని బలపరిచింది. కాని, పెద్దమనుషులు కట్నకానుకలు మాట్లాడుకొంటున్నప్పుడు మీరు మౌనం వహించడం చూస్తే నా ఊహ తలకిందులైంది.
మీరు చదువుకొన్నారు. ఉద్యోగం చేస్తున్నారు. వెనక స్థిరాస్తివుంది. మీకెందుకింకా మీకు కాబోయే భార్య సర్వలాంఛనాలతో రావాలన్న కోరిక?
మా స్థితిగతులేమిటో మీకు తెలియకపోతే నేను చెబుతాను!
మా నాన్నగారు మధ్యతరగతి గృహస్థు. నా తర్వాత ఆడపిల్లలున్నారు పెళ్ళిళ్ళకు. చదువులకు మగపిల్లలున్నారు. ఏ నెల కానెల తల భారమయ్యే ఖర్చుతో సతమతమయ్యే సంసారి మా నాన్నగారు.
అతడి నుండి మీరు పదివేల కట్నం, గట్రా అడిగారు!
ఎక్కడి నుండి తెస్తారు అంత డబ్బు?
తిండిగింజల కాధారమైన పొలం అమ్ముతున్నారు.
నా ఒక్కదాని పెళ్ళికే ఈ ఆస్తి అమ్మితే ముందు పిల్లల భవిష్యత్తు ఏమిటి?
భారతంలో ఓ కథ ఉంది.
బకాసురుడనే ఓ రాక్షసుడు ఉంటాడు. వాడు రోజూ ఊరిమీదపడి చేతికందిన వాడిని పట్టుకొని కరకర నమిలేస్తుంటే ఊరంతా హడలిపోయి వాడితో ఒక ఒప్పందం చేసుకొంటారు. నిత్యం ఓ బండెడన్నం, బండికి కట్టిన దున్నలు, బండికట్టుకొని వెళ్ళిన మనిషి వాడికాహారం అవుతారని, ఇలా విచ్చల విడిగా ఊరిమీదపడి తినకూడదని!
బకుడు ఒప్పుకుంటాడు.
బకుడి విందు వంతు ప్రకారం నిత్యం ఒక్కొ ఇంటికి వస్తూంటుంది.
వంతు తగిలిన ఇంటివారి శోకం వర్ణించడం ఎవరి తరం?
అలాంటి శోకమే ఇప్పుడు ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులూ అనుభవిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
బండిలో అన్నం, బండికి కట్టిన జీవాలు, బండితోలిన మనిషీ వాడికాహారమైపోయినట్టే- ఒక ఆడపిల్ల పెళ్ళిచేసి పంపేటప్పటికి వరకట్నమనే ఈ బకుడికి ఆహారమౌతున్నారు ఆడపిల్ల తల్లిదండ్రులు. ఆడపిల్లను అత్తవారింటికి పంపి సర్వం కోల్పోతున్నారు.
ఆనాడు బకుడి వధకు భీముడిని పంపింది కుంతీదేవి!
వరకట్నమనే ఈ బకుడి సంహారానికి ఇంకా భీముడు పుట్టలేదు.
పిల్ల తల్లిదండ్రుల శాపనార్థాలేవీ ఈ బకుణ్ణి కించిత్ కూడా బాధించడం లేదు. వాడు విజయగర్వంతో వీగిపోతూనే ఉన్నాడు. ఈ బకుడికి ఆహారమయ్యే వంతు ప్రతి ఇంటికీ వస్తూనే ఉంటుంది.
మిమ్మల్ని సంస్కారం చూపమని అడగడం తెలివి తక్కువ.
స్త్రీకి పురుషుడి అండ ఎంత అవసరమో అతడికీ ఆమె తోడు అంతే అవసరం!
ఈ తంతంగానికి ప్రతి మధ్యతరగతి కన్యాదాత బలైపోతున్నాడు.
వివాహపు తంతు ముగిసేసరికి ఇరువైపులా ఎంత మిగులుతుందని చూసుకొంటే వధువు ఒంటిమీద కొద్దిగా నగలు, పట్టుచీరలు, వరుడికి సూటూ బూటూ గడియారం లాంటివి. కట్నాలు, కానుకలు పట్టుకురాలేక బంధువులకు అగచాట్లు!
బంధువులు రాకపోతే, భజంత్రీలు మోగకపోతే వధువు మెడలో పడే ఆ మూడుముళ్ళు గట్టిగా పడవా? ఆ సంబంధం గట్టిగా నిలవదా?
ఈ ఆచారాలు ఒకనాడు ఏదో ఒక ఉద్దేశంతో, ప్రయోజనం కోసమే ఏర్పడి ఉండొచ్చు. ఈనాడు మనది బీదదేశం. ప్రతి పైసా అమూల్యంగా వాడుకోవలసిన ఈ రోజుల్లో అర్థంలేని ఈ ఆచారాలవల్ల ఎంతో డబ్బు వ్యర్థమైపోతూంది! ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అర్ధంలేని, ప్రమాదకరమైన ఆచారం!
నిజంగా నేను మీకు నచ్చితే, నా భావాలను మెచ్చితే కానీ కట్నం లేకుండా రెండు పూల దండలతో నన్ను పెళ్ళిచేసుకోండి! ఉంటాను
IV
నారాయణరావుకు ఒళ్ళు మండుకొచ్చింది. మర్యాదస్తుడు కాబట్టి ఈమె చేసిన ఘనకార్యానికి తిరిగి దుయ్యబట్టకుండా, ఆ ఉత్తరం తనకే పంపించి ఊరుకొన్నాడు! ఇంకే ఉత్తరమూ లేదందులో.
"లీలా!" పిలుపుకాదు, గర్జన.
"ఏమిటి నాన్నా?”
ఆయన కూతురు ముఖంలోకి ఎగాదిగా చూశాడు.
"ఏమిటి నాన్నా? అలా చూస్తావు
J00
"ఇంత గొప్పదానివి ఎప్పుడు అయిపోయావా అని!”
తండ్రి చేతిలో ఉత్తరం చూస్తూనే, సుధాకరరావు ఏదో రాశాడని తెలుసుకొంది లీల. కాని, నిబ్బరంగా నిలబడింది.
“పెళ్లి చేసుకోకుండా నువ్వు ఏం చేయాలనుకొన్నావ్?”
“ఆడపిల్లకు పెళ్ళికంటే మరో పరమావధి లేదని చెప్పేకాలమా ఇది నాన్నా?”
"ఉద్యోగం చేసి నీ జీవితం నీవు గడుపుకోవడంతోనే సమస్యలు తీరిపోతాయనుకొన్నావా? పెళ్ళికాని ఆడపిల్ల బయట కాలుపెడితే ఎన్ని నిందలు చుట్టుకొంటాయో నీకు తెలియదా?”
“పెళ్ళయిన ఆడది బయట కాలుపెట్టినా నిందలు చుట్టుకొంటూనే ఉంటాయి! కాకపోతే కొంచెం తక్కువేమో!”
"కన్న తల్లిదండ్రులపట్ల నీకేమీ బాధ్యత లేదా?”
"బాధ్యత ఎందుకులేదు నాన్నా? ఆ బాధ్యత కోసం నా ఆదర్శాలనూ, ఆలోచనలనూ బలిపెట్టుకోవాలా? చూస్తూ ఈ బకాసురుడి విందుకు మిమ్మల్ని బలిచేయలేను!"
"ఇది బలికాదమ్మా తల్లిదండ్రుల బాధ్యత! ఆడపిల్లను కన్నాక ఒక అయ్యచేతిలో పెట్టాకే తృప్తి!”
“అందుకోసం మీరెంత అవస్థపడుతున్నారో నేను చూడడం లేదా?”
“ఈ బాధలోనే ఉందమ్మా ఆనందం.”
"ఉన్నదంతా ఊడ్చి పెట్టి, మీరు పొందే ఆనందమేమిటి? అవతలింకా పిల్లలు లేరూ?”
అంత ఆగ్రహంలోనూ ఆయన కూతురు వేదన అర్థం చేసుకోకపోలేదు! ఆర్ద్రంగా కూతురి చుబుకం ఎత్తాడు.
“నువ్వొక్కదానివి ఈ నిర్ణయం తీసుకొంటే దేశంలో పెళ్ళికొడుకు లందరికీ ప్రాయశ్చిత్తం జరుగుతుందా అమ్మా! ఎడారిలో వర్షపుబిందువులా ఎంత వరకు ఫలిస్తుంది నీ త్యాగం?”
“నా ఒక్కదానివల్ల ఏం ఉపకారం జరుగుతుందని ప్రతి వర్షబిందువూ కురవడం ఆగిపోతే ప్రపంచం గతి ఎలా మారుతుందో నువ్వు ఊహించలేవా నాన్నా? నీ బిడ్డ ఒక ఉత్తమ గృహిణిగా మసలుకొని మీకు కీర్తి తేవాలన్న తాపత్రయం విడిచి ఆమె ఒక మనిషిగా, వ్యక్తిత్వంతో బతకాలని ఆశీర్వదించండి నాన్నా?"