సమయస్ఫూర్తి
తన ఆస్థానంలో ఉండే బీర్బల్ అంటే అక్బర్‌కు చాలా అభిమానం. ఇది ఆస్థానంలోని మిగిలిన వారికి నచ్చేది కాదు. తాము బీర్బల్ కన్నా తెలివైన వాళ్ళమని వాళ్ళ ఉద్దేశం. ఈ విషయాన్ని అక్బర్ గమనించాడు.
అక్బర్ ఒకనాడు సభలోని వాళ్ళందరినీ ఉద్దేశించి ఇట్లా అన్నాడు. “మీకు నేనొక పరీక్ష పెడుతున్నాను. అదేమంటే మన ఆగ్రా పట్టణంలో ఎన్ని కాకులు ఉన్నవో లెక్కబెట్టి చెప్పండి. సరైన జవాబు చెప్పినవారిని అందరికన్నా తెలివైనవారుగా ఒప్పుకుని మంత్రిపదవి ఇస్తాను".
అందరూ ఇదే అవకాశమనుకొని, తాము బీర్బల్ కన్నా తెలివైన వాళ్ళమని నిరూపించుకోవచ్చని కాకులను లెక్కబెట్టేందుకు పోయారు.
రాజుగారి ఆస్థానంలోని ఉద్యోగులందరూ ఊరిమీద పడి కాకులను లెక్కబెడుతుంటే ప్రజలంతా ముక్కు మీద వేలు వేసుకొన్నారు.
అందరూ ఊరంతా తిరుగుతూ ఇండ్లమీద, చెట్లమీద, నది ఒడ్డున, వీధుల్లో, వాడల్లో, చెత్తా చెదారాలలో వెతుకుతూ కాకులను లెక్కపెడుతునే ఉన్నారు.
అందరిలో ఒకటే భయం. ఎవరు తమకన్నా ముందు పోయి రాజుగారికి లెక్క చెబుతారో, తాము పెడుతున్న లెక సరైనది అవునో కాదో అని భయపడుకుంటూనే కాకులను లెక్కబెట్టసాగారు. కాని బీర్బల్ అయితే ఏమీ లెక్కపెట్టకుండా హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకోసాగాడు.
రాజు చెప్పిన రోజు రానే వచ్చింది. అందరూ రాజుగారి సభలో కూర్చున్నారు.
"ఆగ్రా పట్టణంలో ఎన్ని కాకులున్నవో లెక్కపెట్టారా?” అని అక్బర్ అడిగాడు.
"ఇంకా లేదు ప్రభూ! మాకు ఇంకొంత సమయం కావాలి" అన్నారందరూ, బీర్బల్ తప్ప.
"బీర్బల్! నువ్వు చెప్పు” అన్నాడు అక్బర్.
"ప్రభూ! ఆగ్రా పట్టణంలో మొత్తం ఆరువేల ఎనిమిది వందల మూడు కాకులున్నాయి” అన్నాడు బీర్బల్. వెంటనే ఒకతను లేచి...
"ప్రభూ! నేను ఎంతో కష్టపడి లెక్కపెడితే ఎనిమిది వేల కన్న ఎక్కువనే కాకులున్నాయి..... బీర్బల్ తప్పు చెబుతున్నాడు" అన్నాడు.
“లేదు ప్రభూ! నేను లెక్కపెడితే ఐదువేల కాకులే ఉన్నాయి" అన్నాడు మరొకతను.
"ఏం బీర్బల్! వీళ్ళ లెక్కకు నీ లెక్కకు అంత తేడా ఉన్నది కదా! సమాధానం చెప్పు" అన్నాడు అక్బర్ కోపంగా.
అందరూ బీర్బల్ పని అయిపోయిందని అనుకున్నారు. తమకు మంత్రిపదవి రాకపోయినా బీర్బల్ బండారం బయటపడి, అతని పదవి ఊడుతుందని, బీర్బల్ పీడ పోతుందని అందరు సంబురపడ్డారు.
అప్పుడు బీర్బల్, "ప్రభూ! నేను చెప్పిన సంఖ్యనే సరియైనది. మొదటి వ్యక్తి లెక్కపెట్టినప్పుడు కాకుల చుట్టాలు పక్క ఊరినుండి మన ఊరికి వచ్చాయి. అందుకే అతనికి ఎక్కువ కాకులు కనిపించాయి. రెండో వ్యక్తి లెక్కపెట్టేటప్పుడు మన ఊరి కాకులు పక్క ఊళ్ళోని చుట్టాల ఇంటికి పొయాయి. అందుకే లెక్క తక్కువ వచ్చింది" అన్నాడు.
బీర్బల్ సమయస్ఫూర్తికి అక్బర్ వక్కుమని నవ్వాడు. తమకంటే బీర్బల్కే తెలివితేటలు, సమయస్ఫూర్తి ఎక్కువ అని సభలోని వాళ్ళందరూ ఒప్పుకున్నారు.
No comments:
Post a Comment