ప్రపంచ పదులు - సి. నారాయణరెడ్డి
రచయిత పరిచయంపూర్వపు కరీంనగర్ జిల్లా నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా, హనుమాజీపేట గ్రామంలో జన్మించిన ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి ప్రముఖ కవి, సాహితీ పరిశోధకుడు, బహుభాషావేత్త, ప్రయోగశీలి.నాగార్జునసాగరం, కర్పూర వసంతరాయలు, విశ్వంభర, మధ్యతరగతి మందహాసం, ప్రపంచ పదులు మొ॥న 70 పైగా కావ్యాలు రాశాడు. భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించబడ్డాడు. 'విశ్వంభర' కావ్యానికి జాతీయస్థాయిలో అత్యున్నతస్థాయి సాహితీ పురస్కారమైన “జ్ఞానపీఠ అవార్డ”ను అందుకున్నాడు.
Xxx
పాఠం ఉద్దేశం :
మనిషి సంఘజీవి. సమాజంలోని తోటివారిపట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి. సామూహిక జీవనంలో నిరాశానిస్పృహలకు లోనుకాకుండా అనుకున్నది సాధించుటకు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి. కష్టపడే తత్త్వాన్ని ఏర్పరుచుకోవాలి. లక్ష్యంవైపుగా సాగాలి అనే విషయాలపట్ల అవగాహన కలిగిస్తూ, వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే మార్గాలను చూపిస్తూ, తెలుగు కవిత్వ ప్రక్రియలో 'ప్రపంచ పదులు' సాహిత్య ప్రక్రియను పరిచయం చేయడం ఈ పాఠం ఉద్దేశం.
కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది
చెక్కనిదే శిలకడుపున శిల్పమెలా పుడుతుంది
ఫలితం అందేది తీవ్రపరిణామంలోనె సుమా
మరగనిదే నీరు ఎలా మబ్బు రూపుకడుతుంది
నలగనిదే అడుగు ఎలా నటన రక్తి కడుతుంది.
Summary) కొవ్వొత్తి కరిగితేనే కాంతి నివ్వగలుగుతుంది. రాయిని చెక్కినప్పుడే శిల్పంగా మారుతుంది. తీవ్రమైన మార్పులకు సిద్ధమైనప్పుడే ఫలితం దక్కుతుంది. ఎండవేడికి బాగా కాగిన నీరే ఆవిరై మబ్బుగా మారుతుంది. నాట్యమైనా, మరేదైనా ఆదరించబడాలంటే నిత్యం సాధన చేయాలి. కష్టపడడం ద్వారానే ఏ విజయమైనా, ఫలితమైనా వస్తుంది.
2) పక్షిరెక్కలకు మబ్బులు గొడుగులు పట్టినప్పుడే సార్థక్యం
పారేయేటికి పైరుగొంతులో పాడినప్పుడే సార్థక్యం
ఏ లక్ష్యానికి కట్టుపడక బతుకీడ్చుకుపోతే ఏం లాభం?
నేర్చిన చదువుకు జాతి జాతకం మార్చినప్పుడే సార్థక్యం
కట్టుబానిసకు సంకెళ్ళు మట్టిగరిచినప్పుడే సార్థక్యం.
Summary) పక్షి వంటి అల్పప్రాణులకు నీడ ఇచ్చినప్పుడే మబ్బులకు ఒక ప్రయోజనం కలుగుతుంది. ఏ విధమైన లక్ష్యాన్ని పెట్టుకోకుండా సాదాసీదాగా బతుకుతూపోతే ఏమి ఉపయోగం? మానవ జీవితాలకు మేలు కలిగించినప్పుడే నేర్చుకున్న చదువుకు ప్రయోజనం. వెట్టిచాకిరి బంధనాలు తెగిపోయినప్పుడే, కష్టజీవుల బతుకులకు ప్రయోజనం దక్కినట్లు. స్వార్థాన్ని వదిలిపెట్టి ఇతరులకు ఉపయోగపడినప్పుడే మనిషి జీవితం సార్ధకం అవుతుంది.
3) బురదలోన ఉంటున్నా తరగదు పద్మం విలువ
తాటాకున పడివున్నా తగ్గదు పద్యం విలువ
అసలు సిసలు పసఉంటే అవరోధించేదెవరు
అరసికు లేమంటున్నా చెరగదు గానం విలువ
మూర్ఖులు ముంచేస్తున్నా మునగదు జ్ఞానం విలువ
Summary) బురదలో పుట్టినంత మాత్రాన పద్మానికి విలువ తగ్గదు. తరాలుగా తాటాకుల మీదనే ఉన్నప్పటికినీ పద్యానికి విలువ తగ్గదు. అసలు సిసలు శక్తివున్నప్పుడు దాన్ని ఎవరూ అడ్డుకోలేరు. రసికత తెలియనివారు ఆదరించకపోయినా గానం (పాట) విలువ తగ్గదు. మూర్ఖులు ఎన్ని విధాలుగా ప్రయత్నించి అడ్డగించినా జ్ఞానం విస్తరణను ఆపలేరు. నిజమైన ప్రతిభకు, కళకు ఎప్పుడైనా శాశ్వత విలువ, గుర్తింపు లభిస్తుంది.
4) ఎంత దున్నినా మట్టికి ఎప్పుడైన కలత ఉన్నదా
ఎంత ఉరికినా ఏటికి ఎప్పుడైన నలత ఉన్నదా
అంతలోనె ఉసూరంటు అలసిసొలసి పోతున్నారా?
ఎంత ఎగిసినా నింగికి ఎప్పుడైన కొరత ఉన్నదా
ఎంత పీల్చినా గాలికి ఎప్పుడైన కోత ఉన్నదా?
Summary) తరతరాలుగా మట్టిని దున్నుతున్నప్పటికినీ అది బాధపడదు. అలాగే ఎల్లప్పుడూ పరవళ్ళు తొక్కుతూ ప్రవహించే ఏటికి కూడా అనారోగ్యం ఉండదు. మరి యీ కొద్ది ప్రయాణానికే అలసిపోయే మానవులారా! ఆలోచించుకోండి. ఎంత ఎత్తుకు ఎగిరినప్పటికీ ఆకాశానికి అంతు ఉండదు. ప్రాణికోటి ఎంత పీల్చుకుంటున్నా గాలికి కరువు ఉండదు. మనిషి కూడా ఇటువంటి చైతన్యంతో ఉన్నతమైన లక్ష్యం కోసం కృషిచేయాలి.
No comments:
Post a Comment